పున్నారావు మాష్టారు వ్రాసిన హైకూలు

ప్రజాశక్తి పత్రికలో ప్రచురింపబడిన పున్నారావు మాష్టారి హైకూలు


హైకూలు

సృష్టిలో అంతా సమమే
వ్యత్యాసమంతా
మన దృష్టి లోపమే


ఆడపిల్లకి అభద్రత
భూమ్మీదే కాదు
అమ్మ కడుపులో కూడా


పరువు పంజరంలో
ప్రేమ
జీవిత ఖైదీ


రణక్షేత్రంలో రాలిన
నెత్తుటి పూల కోసం
రెక్కలు విప్పిన రాబందులు
సామ్రాజ్యవాదులు


శ్రమ చెట్టుకు పూసిన
చెమట పూలన్నీ
నేలతల్లి శిగలోకే


నేల మీద రాలిన
చెమట చుక్కలన్నీ
పచ్చగా పండాయి


ఉత్పత్తికీ, వినియోగానికీ
శ్రమ
ఒక ఉత్ప్రేరకం


గుడిసెల్లో కిరోసిన్‌ దీపాలు
ప్రతి సాయంత్రం
చీకటిలో పోరాడుతూనే ఉన్నాయి


మార్కెట్లో సబ్బులకి
వొంటి మురికే వదిలేది
అంటరానితనం కాదు


మనుధర్మం నిరసిస్తూ
పల్లెలన్నీ
ఊరుకి దూరంగా నిలబడ్డాయి


భూగోళం మండుతోంది
పెరిగిన
ధర మంటల్లో


పందులు, ఎలుకలు
కోతులు, మనుషులు
ప్రయోగాలకు
కాదేది అనర్హం


సరళీకృత వ్యాపారంలో
మానవత్వం కూడా
ఒక ముడిసరుకే


మన అంతరంగాలు గీసిన
అడ్డగీతలే గదా!
ఈ కులం గోడలు


ప్రతి ఉదయం
సూరీడు నెత్తుటి ముద్దవుతాడు
మనుషుల్ని మేల్కొలపడానికి


డబ్బులు నిండిన
జేబుల మాటున
గుండె చప్పుడు
లయ తప్పుతోంది


వాన చినుకు కోసం
నేల తల్లి
నోరు తెరిచి
ఎదురు చూస్తోంది


కెరటానికి
అలుపుండదు
శిఖరమెప్పుడూ
శిరమొంచదు


No comments

Powered by Blogger.