Greetings to the media persons on National Press Day




ఈరోజు జాతీయ వార్తల ప్రచురణల/ప్రసారాల దినోత్సవం. వివిధ ప్రాంతాలలో నుండి వార్తలను సేకరించి త్వరితగతిన ప్రజలకు అందించడంలో రిపోర్టర్లు, కెమేరా ఆపరేటర్ల కృషి అతి క్లిష్టమైనది. ఎడిటర్లు, ముద్రణా పనివారు, కంప్యూటర్ ఆపరేటర్ల నిరంతర కృషి వలననే ప్రజలకు మెరుగైన వార్తలు అందగలుగుతున్నాయి.


గత కాలమంతా ముద్రణ ప్రధానంగా మీడియా ప్రచురణలు ఉన్నప్పటికీ వాటిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలు పరోక్షంగా తమ పార్టీల ప్రచారానికి ఉపయోగపడేవి నేటికీ అదే పని చేస్తున్నాయి. కానీ ఇది ఫలానా రాజకీయ పార్టీకి అనుబంధ పత్రిక అని బహిరంగంగా ప్రకటించుకోవు. ఇటీవలి కాలంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన టెలివిజన్ ఛానళ్ళు కూడా అదే విధంగా వివిధ రాజకీయ పక్షాలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. పోటీలుపడి తమ ప్రసారాల నాణ్యతను పెంచుకుంటున్నాయి.

ఉదాహరణకు అధికారంలో ఉన్న పార్టీవారి పత్రిక/టీవీ ప్రభుత్వం తలపెట్టిన పనులు ప్రజలకు ఎక్కువగా ఉపయోగ పడుతున్నాయనీ, ఆ కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంతో లాభపడ్డారని, ఆనందంగా ఉన్నారనీ ప్రచారం చేస్తుంది. కొందరి చేత సాక్ష్యం చెప్పిస్తుంది. ప్రతిపక్షం వాళ్ళు మంచివాళ్ళు కాదని, వారివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదని ప్రచారం చేస్తారు. ప్రతిపక్షం చేసిన 100 విమర్శలలో ఒకటోరెండో ప్రకటించి దానిని 100 మంది పార్టీ నాయకుల చేత విమర్శలు చేయిస్తారు. తద్వారా తమ పార్టీ అభిమానులు తమ పార్టీని వదిలి వెళ్ళకుండా చేయడంలో విశేష కృషి చేస్తారు.

అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలు/టీవీలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, ప్రభుత్వం చేసిన 100 పనులలో ఓకటో రెండో చూపిస్తూ దానిని కూడా 100 మంది తమ పార్టీ నాయకులతో విమర్శించేలా చూస్తారు. అధికార పార్టీ టీవీలు/పత్రికలు చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేయిస్తుంటారు.

దీనిని నాన్ ఫార్మల్ విద్యాబోధన అని అంటారు.  ఒక విధంగా ఇది ప్రజల మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.  కనుక ప్రజలు ఏదోవొక పక్షానికి అనుకూలంగా తమ మానసిక స్థితిని ఫిక్స్ చేసుకుంటారు. ఏపార్టీకి చెందిన అభిమానులు ఆపార్టీ ఛానళ్ళు/పత్రికలు మాత్రమే చూడాలి. మరొకరివి చూస్తే మానసిక సమస్యలు కలుగుతాయి.

నేడు మీడియా సెల్ ఫోను లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రజల జీవితాలలో గురువు స్థానాన్ని పొందిన మీడియా దానిని సద్వినియోగం చేసుకోవాలనీ, నేడు మీడియా దినోత్సవం సందర్భంగా మీడియా వారికి నా శుభాకాంక్షలు.

No comments

Powered by Blogger.